Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Tuesday, August 27, 2013

800.navamoortulainaTTi narasiMhamu - నవమూర్తులైనట్టి నరసింహము

Meaning by Dr.T.Patanjali
Audio archive link : Sri Sathiraju venumadhav, raga Gowla
Audio : G.Nageswaranayudu link 1 link
Audio link : From movie Intinta Annamayya

నవమూర్తులైనట్టి నరసింహము వీడె
నవమైన శ్రీ కదిరి నరసింహము

నగరిలో గద్దెమీది నరసింహము వీడె
నగుచున్న జ్వాలా నరసింహము
నగము పై యోగానంద నరసింహము వీడె
మిగుల వేదాద్రి లక్ష్మీ నరసింహము

నాటుకొన్న భార్గవూటు నరసింహము వీడె
నాటకపు మట్టెమళ్ల నరసింహము
నాటి యీ కానుగుమాని నరసింహము వీడె
మేటి వరాహపులక్ష్మీ నారసింహము

పొలసి అహోబలాన బొమ్మిరెడ్డి చెర్లలొన
నలిరేగిన ప్రహ్లాద నరసింహము
చెలగి కదిరిలోన శ్రీ వేంకటాద్రి మీద
మెలగేటి చక్కని లక్ష్మీ నారసింహము


navamoortulainaTTi narasiMhamu veeDe
navamaina Sree kadiri narasiMhamu

1.nagarilO gaddemeedi narasiMhamu veeDe
naguchunna jvaalaa narasiMhamu
nagamu pai yOgaanaMda narasiMhamu veeDe
migula vaedaadri lakshmee narasiMhamu

2.naaTukonna bhaargavooTu narasiMhamu veeDe
naaTakapu maTTemaLla narasiMhamu
naaTi yee kaanugumaani narasiMhamu veeDe
maeTi varaahapulakshmee naarasiMhamu

3.polasi ahObalaana bommireDDi cherlalona
naliraegina prahlaada narasiMhamu
chelagi kadirilOna Sree vaeMkaTaadri meeda

melagaeTi chakkani lakshmee naarasiMhamu

2 comments:

Sravan Kumar DVN said...

Dr.T.Patanjali:
ముఖ్యమైన అర్థాలు
నవమూర్తులైనట్టి = తొమ్మిది రూపాలు ధరించిన
నవమైన = ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించే
కదిరి నరసింహము = అనంతపురం జిల్లా కదిరి క్షేత్రంలో వెలసిన నరసింహస్వామి.
నగరిలో = అహోబిల పురములో
గద్దెమీది = ఉన్నత పీఠముమీద ఉన్న
జ్వాలా నరసింహము = ఎగువ అహోబిలానికి మూడు మైళ్ళ దూరంలో ఎత్తైన ప్రాంతంలో ఉన్న నరసింహుడు
యోగానంద నరసింహము = చిన్న అహోబిలానికి రెండు మైళ్ల దూరంలో వెలసిన నరసింహ స్వామి
మిగుల = మిక్కిలి
నాటుకొన్న = నెలకొను( To be fixed in anything)
భార్గవూటు నరసింహము = చిన్న అహోబిలానికి మూడు మైళ్ల దూరంలో భార్గవ తీర్థం అనే క్షేత్రంలో వెలసిన నరసింహ స్వామి
నాటకపు = నర్తించే
మట్టెమళ్ల నరసింహము = పెద్ద అహోబిలానికి నాలుగు మైళ్ల దూరంలో బీభత్స మూర్తిగా వెలసిన నరసింహ స్వామి
నాటి = ఆనాటి
కానుగుమాని నరసింహము = దిగువనుంఛి ఎగువ అహోబిల మార్గానికి వెళ్లే దారిలో కానుగ చెట్టు కింద ఉన్న నరసింహుడు . ఈ స్వామికే వరాహ లక్ష్మీ నరసింహుడని ఇంకొక పేరు.
పొలసి = సంచరించి, వ్యాపించి
నలిరేగిన = విజృంభించిన
ప్రహ్లాద నరసింహము = ఎగువ అహోబిలంలో నరసింహ స్వామికి, ఉగ్ర స్తంభానికి మధ్యలో వెలసిన స్వామి
చెలగి = ప్రకాశించి
మెలగేటి = తిరిగేటి
లక్ష్మీ నారసింహము = శ్రీ వరాహ స్వామి సన్నిధికి ఎగువగా సుమారు రెండు మైళ్లదూరంలో ఉన్న మాలోల నరసింహ స్వామి
మాలోల = లక్ష్మీదేవియందు ఇష్టము గల

Sravan Kumar DVN said...

తాత్పర్యము
అనంతపురం జిల్లా కదిరిలో ఉన్న నరసింహ స్వామిలో -తొమ్మిదిమంది నరసింహ మూర్తులను దర్శిస్తూ అన్నమయ్య పాడిన గీతమిది:

ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తూ , తొమ్మిది రూపాలు ధరించిన , నరసింహ స్వామి మన కళ్ల ఎదురుగా ఉన్న ఈ కదిరి నరసింహస్వామి. భక్తితో చూస్తే ఈయనలో తొమ్మిది రూపాలు కనిపిస్తాయి.

1. అహోబిలం కొండమీద ఒక గుహలో అరుగు మీద పది భుజాలతో ఉన్న వీర నరసింహస్వామి ఈ కదిరి నరసింహ స్వామి. పైన అహోబిలంలో నవ్వుతున్న జ్వాలా నరసింహ స్వామి ఇతడే. చిన్న అహోబిలపు కొండపై ఉన్న యోగానంద నరసింహ స్వామి ఇతడే. వేదాద్రిలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి ఇతడే.

2. చిన్న అహోబిలానికి దగ్గరలో భార్గవ తీర్థం అనే క్షేత్రంలో వెలసిన నరసింహ స్వామి ఇతడే. పెద్ద అహోబిలానికి నాలుగు మైళ్ల దూరంలో బీభత్స మూర్తిగా వెలసిన మట్టెమళ్ల నరసింహ స్వామి ఇతడే. కానుగ చెట్టు కింద ఉన్న కానుగ నరసింహ స్వామి( వరాహ లక్ష్మీ నరసింహుడు )ఈ కదిరి నరసింహ స్వామి.

3. విజృంభిస్తూ ఎగువ అహోబిలంలో నరసింహ స్వామికి, ఉగ్ర స్తంభానికి మధ్యలో వెలసిన ప్రహ్లాద నరసింహస్వామి ఇతడే. కదిరిలో ఉన్న ఈ నరసింహ స్వామియే వేంకటాద్రి మీద ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి.

ఆంతర్యము
కర్నూల్ జిల్లాలోని నంధ్యాలకు కు 74 కి.మీల దూరంలో, చిత్తూరు జిల్లా తిరుపతికి 75 కి.మీ దూరంలో, హైదరాబాద్‌కు 365 కి.మీల దూరంలో అహోబిల పుణ్యక్షేత్రంఉన్నది. ఇక్కడ నరసింహస్వామి తొమ్మిది రూపాలలో కనిపిస్తాడు కనుక ఈ క్షేత్రానికి 'నవ నరసింహ క్షేత్రం'అని ఇంకొక పేరు. ఆ తొమ్మిది రూపాలు ఇవి : 1.జ్వాల,2. వీర, 3.యోగానంద,4. కానుగుమాని, 5.మట్టెమళ్ల ,6. భార్గోటి, 7.ప్రహ్లాద, 8.లక్ష్మీ, 9.వరాహ నరసింహులు. వీరిని అన్నమయ్య ఈ కీర్తనలో వర్ణించాడు.

ఖాద్రి అనే పేరు కాల క్రమంగా కదిరిగా మారిందని స్థల పురాణం. ఖాద్రి అనేది ఒక చెట్టు పేరని, ఆ చెట్టు కింద ఉన్న చీమల పుట్టలో నరసింహస్వామి పుట్టాడడని ఒక కథ. ఖదిర’ (=ముడుగుదామర) వృక్షాలు ఎక్కువగా ఉండటం వల్ల కదిరి అని పేరు వచ్చిందని ఇంకొక కథ. ఈ కదిరి నరసింహస్వామిని దర్శించుకొన్న అన్నమయ్య హృదయాకాశంలో అహోబిలంలోని నవ నారసింహ మూర్తులు దర్శనమిచ్చారు. మిగతా అవతారాల నిడివి ఎక్కువ. నరసింహ స్వామి అవతార కాలం తక్కువ. కాని ఆ అవతార ప్రభావం భక్తుల మీద చాల ఎక్కువ.

నగుచున్న జ్వాలా నరసింహము
అతి భయంకర మైన రూపంతో హిరణ్యకశిపుని రొమ్ముని చీల్చి చంపినందుకు ఈ స్వామిని "జ్వాలా నరసింహుడు" గా వ్యవహరిస్తారు.జ్వాలా నరసింహస్వామి క్షేత్రము దగ్గర భవనాశని అను జలపాతము ఉంది. ఇక్కడ స్నానంచేస్తే అన్ని పాపాలు పోతాయి అని భక్తుల నమ్మకం. ఇక్కడ అన్నమయ్య నగుచున్న విశేషణం వికటాట్ట హాసానికి సంబంధించినది.

నగము పై యోగానంద నరసింహము వీడె
యోగములో ఆనందాన్ని ఇస్తాడు కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహ స్వామి అని పేరు. .ప్రహ్లాదుడు ఈ యోగ నరసింహుని దయతో యోగాభ్యాసం చేసాడట. తమిళనాడు లోని ఘటికా చల క్షేత్రం లో .యోగానంద నరసింహ స్వామి (శాంత నరసింహ) దేవాలయం ఉన్నది. .ఇక్కడ స్వామి పద్మాసనంలో ఉండి శాంతం గా భక్తులకు కనిపిస్తారు. ఇరువదినాలుగు నిమిషముల కాలములో పాటు ఇక్కడ స్వామి ని ధ్యానం చేస్తే చాలు మోక్షం ప్రసాదిస్తాడని నమ్మకం..అన్నమయ్య వర్ణించిన అహోబిలంలో నగముపై యోగానంద నరసింహ స్వామి కూడా ఆ శక్తి సామర్థ్యములు కలవాడే.

మిగుల వేదాద్రి లక్ష్మీ నరసింహము
లక్ష్మీ నరసింహ స్వామి అహోబిలంలోని వరాహ స్వామికి పైన రెండు మైళ్ల దూరంలో ఉన్న స్వామి. అన్నమయ్య ఈ కీర్తనలో ఉద్దేశించిన నవ నరసింహులు అహోబిలానికి సంబంధించిన వారు కనుక ఈ కీర్తనలో వేదాద్రికి - వేదములు కొలువైన అహోబిలం అని చెప్పుకోవాలి.వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వేరు. ఇది కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు 9 కి.మీ.ల దూరంలోఉంది. పంచ నారసింహ క్షేత్రంగా ప్రసిధ్ధి పొందిన ఈ వేదాద్రిలో స్వామివారు 1. శ్రీ జ్వాలా నరసింహస్వామి2. శ్రీ సాలిగ్రామ నృసింహ స్వామి 3. శ్రీ వీర నృసింహ స్వామి 4. శ్రీ యోగానంద స్వామి 5. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి రూపాలలో అవతరించారు.

అన్నమయ్య కీర్తనలో నరసింహ దేవుని విశేషాలు ఎన్ని చెప్పినా తరగవు.ఎందుకంటే నరసింహ దర్శనానుభూతి కీర్తనలోని పదాలుగా మారింది కాబట్టి. స్వస్తి.