ఇహపరసాధన మిది యొకటే - సహజపు మురారి సంకీర్తననొకటే
భవసాగరముల బాపెడిది తేప - భువి నజ్ఞానము పులివాకట్టిది
జవళి నాశాపాశములకు కొడువలి - నవనీతచోరు నామం బొకటే
చింతా తిమిరము చెరచేటి సూర్యుడు - అంతట దరిద్రహతపు నిధానము
వింత మరణభయవినాశ మంత్రము - మంతుకు హరినామంబిది యొకటే
మించు దుఃఖముల మృతసంజీవని - అంచల పంచేంద్రియముల కంకుశము
ఎంచగ శ్రీ వేంకటేశు దాసులకు - పంచిన పాళ్ళ పరగిన దొకటే
ihaparasAdhana midi yokaTE - sahajapu murAri saMkIrtananokaTE
bhavasAgaramula bApeDidi tEpa - bhuvi naj~nAnamu pulivAkaTTidi
javaLi nASApASamulaku koDuvali - navanItachOru nAmaM bokaTE
chiMtA timiramu cherachaeTi sUryuDu - aMtaTa daridrahatapu nidhaanamu
viMta maraNabhayavinaaSa maMtramu - maMtuku harinAmaMbidi yokaTE
miMchu du@hkhamula mRtasaMjIvani - aMchala paMchEMdriyamula kaMkuSamu
eMchaga SrI vaeMkaTESu dAsulaku - paMchina pALLa paragina dokaTE
కలియుగంలో నామస్మరణకు, నామసంకీర్తనకు ఉన్న ప్రాధాన్యత ఎనలేనిది! సాక్షాత్తూ భగవంతుడే తాను కలియుగంలో కేవలం ‘సంకీర్తనం’ చేత సంతుష్టుడునౌతానని ప్రకటించాడు. అందుకే కలౌ సంకీర్త్య కేశవమ్ అని, సంకీర్త నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖాస్సుఖినోభవన్తి అని పలురకాలుగా పేర్కొన్నారు. అటువంటి విశిష్ట సంకీర్తన మంత్రాన్ని తాను ఉపాశించి మనందరికీ కరదీపికగా, ఆత్మజ్యోతిగా అందించాడు అన్నమయ్య ఈ సంకిర్తనలో ఇహపరాలను సాధించడానికి సాధనము మురారి సంకీర్తనమొకటేనని చాటి చెబుతూ, చరణాలలో ఆ సంకీర్తన ఏ విధంగా విశ్వరూపం ధరించి మనల్ని భవబంధ విముక్తుల్ని చేస్తుందో, అజ్ఞానాంధకారాలను దారిద్ర్యాన్ని, మరణ భయాన్ని, పలు బాధలను, పంచేంద్రియాల వికారాలను ఏ విధంగా రూపుమాపుతుందో చక్కగా స్పష్టం చేస్తున్నాడు ఆచార్య పురుషుడు! మరి మనం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇహపరసాధక మంత్రమైన సంకీర్తనను ఆశ్రయిద్దాం!
మురారి - ముర + అరి = రాక్షసులకు శత్రువు (శ్రీ మహావిష్ణువు);
భవసాగరము = సంసారమనెడు సముద్రము
జవళి = రంగురంగుల (భ్రాంతిని కలుగజేయు)
తిమిరము = అంధకారము
మంతుకు = ప్రసిద్ధికి
మించు = ఎక్కువైన
అంకుశము = ఏనుగు కుంభస్థలము నందు పొడిచెడి ఆయుధము
పరగిన (పరిగీ) = ప్రీతితో / అతిశయముతో
అంకుల = ప్రక్క, పార్వ్యము (శ.ర)