Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Tuesday, December 03, 2019

861. paMTalabhaagyulu veeraa bahuvyavasaayulu - పంటలభాగ్యులు వీరా బహువ్యవసాయులు



Audio Archive link : Sri Sathiraju Venumadhav
 
పంటలభాగ్యులు వీరా బహువ్యవసాయులు
అంటిముట్టి యిట్లఁ గాపాడుదురు ఘనులు    =పల్లవి=

పొత్తుల పాపమనేటి పోడు నఱకివేసి
చిత్తమనియెడు చేను చేనుగా దున్ని
మత్తిలి శాంతమనే మంచివాన వదనున
విత్తుదురు హరిభక్తి వివేకులు    =పంట=


కామక్రోధాదులనే కలువు దవ్వివేసి
వేమరు వైరాగ్యమనే వెలుఁగు వెట్టి
దోమటి నాచారవిధుల యెరువులువేసి
వోముచున్నారు జ్ఞానపుఁ బై రుద్యోగజనులు    =పంట=

యెందు చూచిన శ్రీవేంకటేశుఁ డున్నాఁడనియెడి-
అందిన చేని పంట లనుభవించి
సందడించి తమవంటి శరణాగతులుఁ దాము

గొంది నిముడుకొందురు గురుకృప జనులు    =పంట=

paMTalabhaagyulu veeraa bahuvyavasaayulu
aMTimuTTi yiTla@M gaapaaDuduru ghanulu    =pallavi=

pottula paapamanaeTi pODu na~rakivaesi
chittamaniyeDu chaenu chaenugaa dunni
mattili SaaMtamanae maMchivaana vadanuna
vittuduru haribhakti vivaekulu    =paMTa=

kaamakrOdhaadulanae kaluvu davvivaesi
vaemaru vairaagyamanae velu@Mgu veTTi
dOmaTi naachaaravidhula yeruvuluvaesi
vOmuchunnaaru j~naanapu@M bai rudyOgajanulu    =paMTa=

yeMdu choochina SreevaeMkaTaeSu@M Dunnaa@MDaniyeDi-
aMdina chaeni paMTa lanubhaviMchi
saMdaDiMchi tamavaMTi SaraNaagatulu@M daamu
goMdi nimuDukoMduru gurukRpa janulu    =paMTa=












పల్లవి
అనేక వ్యవసాయములు(ప్రయత్నములు) చేయు వీరు ( రాబోవు 03 చరణాల్లో చెప్పబోతున్న జ్ఞానులు) అనేక అదృష్టములనెడి పంటలు కలిగినవారు.(అదృష్టవంతులని భావం)
ఘనులైన వీరు సంబంధం కల్పించుకొని ఈ రకంగా (రాబోవు 03 చరణాల్లో చెప్పబోతున్నవిధంగా) లోకాన్ని రక్షిస్తుంటారు. (తమ తోటి వారికి మార్గదర్శకులై ప్రజలను కాపాడుతుంటారని భావం)
01 చరణం
వ్యవసాయదారులు- విత్తనాలు నాటడానికి ముందు తమపొలంలో ఉండే పోడును (a bushy land) మొదటగా నరికి వేస్తారు .తరువాత దున్ని దుక్కి చదరం చేస్తారు. తరువాత పదనుగా (పది అంగుళములవరకు నేలయందు తడి చొచ్చునంతటి వర్షప్రమాణము ) వాన పడినవెంటనే విత్తనాలు నాటుతారు.
శ్రీ హరియందు భక్తి కలిగిన వివేకులు కూడా ఇలాగే – మనస్సు అను నేలలో సంబంధాల గుబురు చెట్లతో ప్రాప్తించే దట్టంగా ఉన్న పాపము అను పోడును (a bushy land) మొదటగా నరకి వేస్తారు. (సంబంధాలకు దూరమవుతారని భావం)
తరువాత మనస్సును దున్ని దుక్కి చదరం చేస్తారు. ( విషయాలకు చలించని స్థిరమైన మనస్సు కలవారవుతారని భావం) ఆనందంగొలిపే శాంతము అను మంచివాన పదనుగా పడినవెంటనే –అనగా శాంత స్వభావులై -భక్తి అను విత్తనాలు నాటుతారు.
02 చరణం
వ్యవసాయదారులు తమ పొలంలో పైరుతోపాటు మొలకెత్తే గడ్డిని తవ్వి తీసివేస్తారు. పంటని నాశనంచేసే పశువులనుంచి రక్షణగా అనేకసార్లు తమ చేనుచుట్టూ వెలుగు పెడతారు.( వెలుగు= పశువులు లోనగునవి రాకుండా చేను చుట్టూ ముండ్లచెట్టు పెట్టి పెంచు ఆవరణము.) చేను బాగా పెరగటానికి ఎరువులు వేస్తారు. ఈ రకంగా వ్యవసాయదారులు పంటలను రక్షించుకొంటారు.
ఇదే పద్ధతిలో జ్ఞానమను చేనును పెంచుకొను ప్రయత్న శీలులు తమ మనస్సను పొలంలో కామము, క్రోధము అను కలుపును తీసివేస్తారు. లౌకిక వాంఛలనుంచి తమ జ్ఞానానికి రక్షణగా అనేకసార్లు తమ చేనుచుట్టూ వైరాగ్యమను వెలుగు పెడతారు .జ్ఞానమను చేను పెరగటానికి అనుభవింపరాని ఆచారాల విధులను ఎరువులుగా వేస్తారు. ఈ రకంగా జ్ఞానమను చేనును ఆధ్యాత్మిక వ్యవసాయదారులు రక్షించుకొంటారు.
03 చరణం
ఎక్కడ చూసినా శ్రీవేంకటేశుడున్నాడను బుద్ధితో – తమకు అందిన (తాము పొందిన) జ్ఞానమను పంటలను(జ్ఞానమను అదృష్టాన్ని) ఆధ్యాత్మిక వ్యవసాయదారులు అనుభవిస్తారు. తమవంటి శరణాగతులతో కలిసి శ్రీ వేంకటేశ్వర గోష్ఠీగానపు సందడులు చేస్తూ, తమతమ గురువుల దయా విశేషములను తమ మనస్సు మూలలలో ఇముడ్చుకొంటారు.( తమ గురువుల దయల ప్రభావాన్ని పొంది శ్రీ వేంకటేశ్వర నామ ప్రచారం చేస్తారని భావం)
విశేషాలు
పంటలపై అన్నమయ్య ఇతర పదప్రయోగాలు -అర్థాలు
1. ఇంటిలోని పంట=అందుబాటులో నుండేది.
2. చేనిపంట కోయిలకాలే చెప్పీ=(పంటకోయగా మిగిలిన ధాన్యపు కంకులు- కొయిలకాలు) కొయిలకాలను గమనిస్తే చేనిలో పంటను తెలుసుకోవచ్చు.
3. తెరువుపెసరు=దారి పక్కనగల పెసరచేను. పంటలో యజమానికి దక్కేది కొంచెమే.
4. నిచ్చపంట=ప్రతినిత్యమూ వచ్చే ఫలితం(నిమ్మపంట వేసితే రాత వేయు-ఉపకారం చేసినవారికి అపకారం చేయు) పంటకెక్కు - ఫలోన్ముఖమగు.
5. పంటపండు = అదృష్టం ఫలించు.
6. పండినపంటలు =ఆనందదాయకములు.
7. పట్టపగలు చీఁకటి పంటపండ =పట్టపగలు మిక్కిలి చీకటి యగు
8. పాలికిచ్చిన రాసి =కౌలు కిచ్చిన పొలంలోని పంట.
9. ఫలము లేని పంట=నిష్ప్రయోజనం
10. మఱ్ఱిమాని పంట=మఱ్ఱికాయలు కాపు ఎక్కువ ప్రయోజనం శూన్యం
11. ఇంటిలోని పంట=అందుబాటులో నుండేది.

****

 

No comments: