797.anniTaa naapaaliTiki hariyaataDae kalaDu - అన్నిటా నాపాలిటికి హరియాతడే కలడు
అన్నిటా నాపాలిటికి హరియాతడే కలడు | ఎన్నికగా తుది పదమెక్కితిమి మేలు ||
కొందరు జీవులు నన్ను కోపగించినా మేలు- | చెంది కొందరు అట్టే సంతసించినా మేలు |
నిందించి కొందరు నన్ను నేడే రోసినా మేలు | పొందుగా కొందరు నన్ను పొగడినా మేలు ||
కోరి నన్ను పెద్దసేసి కొందరు మొక్కినా మేలు | వేరె హీనుడని భావించినా మేలు |
కూరిమి కొందరు నన్ను గూడుకుండినా మేలు | మేరతో విడిచి నన్ను మెచ్చుకున్నా మేలు ||
ఇప్పటికి గలపాటి యెంత పేదయినా మేలు | వుప్పతిల్లు సంపద నాకుండినా మేలు |
యెప్పుడు శ్రీవేంకటేశుకే నిచ్చిన జన్మమిది | తప్పు లేదాతనితోడి తగులమే మేలు ||